Thursday, May 16, 2013

నవ్వుల నవాబులు... మన తారలు

 
 
నవ్వుల నవాబులు... మన తారలు
మూకీ సినిమాల్లో కూడా హాస్యం ఉండేది. కొన్ని ఏకంగా హాస్య సినిమాలే వచ్చాయి. ఆ హాస్య నటులు నటిస్తున్నప్పుడు, సంభాషణలు చెబుతూనే నటించారు, అతిగా నటించారు. ఆంగికం ఎక్కువ. ఐతే, వాళ్లు ఏం డైలాగులు చెప్పారు? ఎలా నవ్వించదలచుకున్నారు? తెలీదు - శబ్దం లేదు గనక! హాల్లో ఉన్న వ్యాఖ్యాత, తనకు అర్థమైన రీతిలో, లేదా తన పాండిత్యంతో ఆ హాస్య సంభాషణల్ని ''అనువదించేసేవాడు''. పరిగెత్తడాలు, పడిపోడాలు, కొట్టుకోడాల్లాంటివుంటే జనం నవ్వితే నవ్వేవారు. హాస్యం సన్నివేశం ద్వారా, సంభాషణ ద్వారానే పలుకుతుంది. మూకీ పుట్టిన 18 సంవత్సరాల తర్వాత టాకీ వచ్చింది. టాకీలో అన్ని రసాలతోపాటు హాస్యం ఉండి తీరాలి. 'శకుంతల' (1932) సినిమా నుంచి హాస్య పాత్రలు ఆరంభమైనాయని చెప్పుకోవచ్చు. అందులో జాలరులున్నారు. వాళ్లే శకుంతల చేతి ఉంగరాన్ని మింగిన చేపను పట్టుకుంటారు. వాళ్లతో హాస్యం పలికించారు. 'సావిత్రి'లో యమకింకరులు హాస్యం చేశారు. అలా, ఉపపాత్రల ద్వారా హాస్యం రాబట్టారు దర్శకులు. నాటి 'లవకుశ' (1934)లో చాకలి పాత్ర తప్పితే హాస్యం పలికించిన పాత్ర లేదు. అందుకనే, అదే సి.పుల్లయ్య గారు మళ్లీ 'లవకుశ' (1963) తీసినప్పుడు రమణారెడ్డినీ, సూర్యకాంతాన్ని పెట్టి హాస్య దృశ్యాలు అల్లారు. 'హరిశ్చంద్ర' (1935)లోని నక్షత్రకుడిది నిజానికి హాస్య పాత్ర కాదు. కానీ, హాస్యం కోసం అలా మలిచారు. అప్పుడు పులిపాటి వెంకటేశ్వర్లు నటించినా, మళ్లీ తీసినప్పుడు రేలంగి, మళ్లీ తీసినప్పుడు రమణారెడ్డి నక్షత్రకుడి పాత్ర ధరించి నవ్వించారు. అలా, హాస్యాన్ని అవసరమైనంత వరకూ మన చిత్రాలు వాడుకున్నాయి. ఉపపాత్రల ద్వారా వచ్చిన హాస్యం, తర్వాత ముఖ్యపాత్ర ద్వారానే వచ్చిన సినిమా 'బారిస్టర్‌ పార్వతీశం' (సాంఘికం: 1940) ఇందులో లంకసత్యం ప్రధాన పాత్ర ధరించి, మనకి 'తొలి హాస్య హీరో' అయ్యాడు. ఇది నవలా చిత్రం; పూర్తి హాస్య చిత్రం. కానీ పూర్తి నిడివి గల చిత్రం కాదు. కనక, 'బొండాం పెళ్లి' 'చదువుకున్న భార్య' అనే లఘు హాస్య చిత్రాలు కలిపి - విడుదల చేశారు. 'రేలంగి'గా విశ్వరూపం చూపించిన వెంకట్రామయ్య 'ధ్రువ-అనసూయ' (1936) చిత్రాల్లోని 'ధ్రువ'లో ఇంద్రుడి వేషం - (ధ్రువుడు తపస్సు చేస్తూ ఉంటే, వర్షం కురిపిస్తూ ఉంటాడు) వేశాడు. అతగాడు హాస్యం గొప్పగా పలికిస్తాడని అప్పుడు ఎవరికీ తెలీదు. తెలిసి ఉంటే అప్పుడే అతన్ని ప్రతి చిత్రంలోనూ వాడుకుని ఉండేవారు. హాస్యాన్ని ఎలాగో ఒకలాగ కలుపుకుంటూనే వచ్చాయి మన సినిమాలు - సరైన హాస్యనటుడు దొరికే వరకూ. లంక సత్యం హాస్యపాత్ర చేసినా, ('నాకు హాస్యం రాదు మొర్రో' అని మొత్తుకున్నాట్ట) తర్వాత రాణించలేదు - 'బాలనాగమ్మ' (1942) వచ్చే వరకూ. 'బాలనాగమ్మ' రెండు సమగ్రమైన హాస్య పాత్రల్ని ఇచ్చింది. ఒకటి - కొత్వాల్‌ పాత్ర; రెండోది చాకలి తిప్పడి పాత్ర. కొత్వాల్‌గా రేలంగి వెంకట్రామయ్య - తొలిసారిగా ప్రేక్షకుల్ని గొల్లు గొల్లుమని నవ్వించాడు. చాకలి తిప్పడి వేషం లంక సత్యం. ఈ పాత్రతో సత్యం బాగా నవ్వించి - హాస్య నటుడిగా స్థిరపడ్డాడు. ఆ రాణింపునకు కారణం ఆ చిత్రం దర్శకుడు సి.పుల్లయ్య గారు. రచయితలు, దర్శకులూ హాస్యపాత్రలు సృష్టిస్తారు. నిర్వహించడానికి నటులు కావాలి. మూకీ సినిమాలకి వ్యాఖ్యాతగా కస్తూరి శివరావు హాస్యం పలికించినా, అతగాడికి సినిమాల్లో వెంట వెంటనే హాస్యపాత్రలు రాలేదు. సి.పుల్లయ్య గారిదే - 'వర విక్రయం' (1939) ఒక చిన్న వేషం వేశాడు - మామూలుదే. 'వందేమాతరం' (1939)లో ఇంటల్లుడి పాత్ర ఉంది. ఎక్కడా వేదిక, రంగస్థలం దొరక్క వాళ్ల ఇంటి మీదికెక్కి - భాగోతం ఆడతాడు. గోబేరు సుబ్బారావు అనే నటుడిచేత - ఈ వేషం వేయించారు. ('గుణసుందరి కథ'లో ఒక అల్లుడుగా వేశాడు తర్వాత) కానీ, సుబ్బారావుకి పేరొచ్చినా - అతడు నవ్వించినా - హాస్యనటుడిగా స్థిరపడలేదు. తర్వాత వాహినీ వారూ ఎక్కువగా ప్రోత్సహించలేదు.
బొండాంపెళ్లి, అంతకుముందొచ్చిన 'గృహలక్ష్మి' (1938)లో ఉన్న హాస్యం మోటు హాస్యం. లావుగా, పెద్దపొట్టతో ఉన్న నటుడి చేత - ఏవో చేష్టలు చేయించి నవ్వు పుట్టించాలని తాపత్రయపడ్డారు. ఆ హాస్యాన్ని నాటి ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. అంగవైకల్యం మీదా, శరీరం మీదా హాస్యం పలికించాలని చూసిన సినిమాలు వచ్చాయి. అప్పట్లో వచ్చిన గ్రామఫోను రికార్డులు - బూతుపాటలతో ఉన్న హాస్యం అందిస్తే విన్నవాళ్లలో నవ్విన వాళ్లూ ఉన్నారు. అసహ్యించుకున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి హాస్యం కూడా సినిమాల్లో వచ్చింది. 'చింతామణి' నాటకంలో శ్రీహరి, సుబ్బిశెట్టి పాత్రల ద్వారా అశ్లీలమైన సంభాషణలు చెప్పించి - పామరులచేత చప్పట్లు కొట్టించిన వైనం - నేటికీ అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నా - అలాంటి హాస్యాన్ని సినిమా ప్రేక్షకులు ఎక్కువగా ఆనందించలేదు. సభ్యతాయుతమైనదీ, సన్నివేశపరమైనదీ, అందర్నీ హాయిగా నవ్వించే హాస్యం కోరుకున్నారు. దర్శక నిర్మాతలు అలాంటి 'హాస్యమే హాస్యం' అని, ఆలోచనలు చేశారు. ''గంభీరంగా ఉన్న కథల్లో హాస్యం ఎందుకు?'' అని - కొందరు దర్శకులు హాస్యం జోలికిపోకపోయినా, ఆ సినిమాలు ప్రజ చూశారు. 1941లో ఎన్‌.జగన్నాథ్‌గారు రెండు చిన్న హాస్య చిత్రాలు తీశారు. రెండూ కలిపి ఒక సినిమా. తారుమారు, భలేపెళ్లి. 'తారుమారు'కి కొడవటిగంటి కుటుంబరావు గారు. 'భలే పెళ్లి'కి పింగళి నాగేంద్రరావు గారూ సంభాషణలు రాసి, మంచి హాస్యం అందించారు. ఈ హాస్యం ఆమోదయోగ్యమైనదని అందరూ భావించారు. ఈ సినిమాల్లో సన్నివేశపరమైన హాస్యం ఉంది. ఐతే, హాస్యనటులనిపించుకున్న వాళ్లు ఆ పాత్రలు ధరించలేదు. ధరించకపోయినా, సన్నివేశం నవ్వించింది గనక, ఆ నటుల గురించి ప్రేక్షకులు పట్టించుకోలేదు.
తమిళ చిత్రాల్లో ఎన్‌.ఎస్‌.కృష్ణన్‌, టి.ఎ.మధురం జంట - దాదాపు ప్రతి చిత్రంలోనూ ఉంటూ చక్కని హాస్యం చేస్తున్నారు. నాగయ్య గారు నిర్మించిన 'భాగ్యలక్ష్మి' (1943)లో ఆ జంటను పెట్టి, సినిమా కథతో సంబంధం లేకపోయినా - మంచి సన్నివేశ హాస్యం చూపిస్తే ప్రజ హర్షించింది. ఆ తర్వాత సినిమా కథతో సంబంధం లేకపోయినా, విడిగా హాస్యపాత్రల్ని పెట్టి చూపించిన కొన్ని సినిమాలు వచ్చినా, హాస్యపాత్రలు కూడా కథతోపాటే ఉంటే, ఔచిత్యంగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. 'స్వర్గసీమ' (1946)లో అలాంటి ప్రయోగం చేశారు - బి.ఎన్‌.రెడ్డి, చక్రపాణి. ఇందులో శివరావు చక్కని హాస్యం ఒలికించి రాణించాడు. లింగమూర్తి పాత్ర కూడా హాస్యం పలికించింది. 'గొల్లభామ' (1947)లో రేలంగి చేసిన హాస్యం - బాగా నవ్వించింది. 'బాలరాజు' (1948)లో శివరావు - హాస్యపాత్ర ధరించి, పాటలు పాడి - ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాడు. ఈ సినిమాతో అతను - హాస్యనటుడిగా పూర్తిస్థాయిలో ప్రాచుర్యం పొందాడు. 'స్టార్‌ కమెడియన్‌'గా నిలిచాడు. మొదటి హాస్యనటుడిగా లంక సత్యం పేరుతెచ్చుకున్నాడు; మొదటి 'హాస్యతార'గా శివరావు ప్రఖ్యాతి పొందాడు. శివరావు, రేలంగి ప్రజలకు చేరువయ్యారు. 1949లో వచ్చిన 'గుణసుందరి కథ', 'మనదేశం', 'కీలుగుర్రం' చిత్రాలతో రేలంగి శకం ఆరంభమైంది. హావభావాలు, సంభాషణా చాతుర్యం రేలంగి దగ్గర అద్భుతంగా పలికాయి. 'పాతాళభైరవి' (1951) పాత్రతో - రేలంగే రేలంగి అన్నారు. చక్కని, సభ్యతాయుతమైన హాస్యం చేసి - ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. ఉత్తమ ధోరణిలో ఉన్న చక్కని హాస్యాన్ని మన సినిమాలు అందించాయి. రచయితలు, దర్శకులూ కచ్చితంగా మంచి హాస్యం ఇవ్వాలని కృషిచేశారు. ఆ పాత్రలకి మంచి నటులు వచ్చారు. ఇవాళ కూడా మనం ఆ హాస్యం గురించి మాట్లాడుకుంటున్నామంటే - హాస్యానికి ఉన్నత పీఠం వేసిన - మన దర్శక నిర్మాతలు, నటులూ, ప్రేక్షకులూ. తర్వాత తర్వాత, రమణారెడ్డి, బాలకృష్ణ, పద్మనాభం, సారథి, నల్లరామ్మూర్తి, సీతారామ్‌, సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, రమాప్రభ, అల్లురామలింగయ్య, రాజబాబు, చలం, కె.వి.చలం, పొట్టిప్రసాద్‌, మోదుకూరి సత్యం, మాడా వంటి నటులెందరో - నాటి మన హాస్యాన్ని సుసంపన్నం చేశారు. కామెడీ, కారెక్టర్స్‌ అనబడే పాత్రల ద్వారా కూడా మంచి హాస్యం వచ్చింది. నాగభూషణం, రావుగోపాలరావు వంటివారు - హాస్యనటుల జాబితాలోకి రాకపోయినా - మంచి హాస్యం అందించారు. హీరోల ద్వారా కూడా సున్నితమైన హాస్యం పలికింది. 'స్వర్ణయుగం' అనిపించుకున్న కాలంలో - తెలుగు సినిమా ఉత్తమ ధోరణిలో ఉన్న సంప్రదాయ హాస్యం అందించి పేరు తెచ్చుకుంది.
This entry was posted in :

0 comments:

Post a Comment