Saturday, May 18, 2013

కుర్రకారు...నాటకాల జోరు!


సరదాల్లో తేలిపోవాల్సిన కుర్రప్రాయం... సందేశాలిస్తూ ముఖాలకు రంగు పులుముకుంటున్నారు... పుస్తకాలతో కుస్తీ పడుతూనే... నాటకాలతో అదరగొడుతున్నారు... డిజిటల్‌ యుగంలో.. ఫ్యాషన్ల కాలంలో... డ్రామాలతో ఆకట్టుకుంటున్నారు... ఆ విజయాన్ని అంకెల్లో చెప్పాలంటే... యాభై తొమ్మిది ప్రదర్శనలు.. యాభైవేల ప్రేక్షకులు... వాళ్లతో మాట కలిపింది 'ఈతరం'.
డుగు పెట్టేది ఏ రంగమైనా అంతు చూసే యువత పట్టుదలకు చిరునామా కావాలంటే 'మిస్‌ మీనా' బృందాన్ని కలవాలి. సినిమా, డిజిటల్‌రంగాలు విజృంభిస్తున్న ఈ రోజుల్లో ఎప్పుడో మసకబారిన నాటక రంగాన్ని ఎంచుకోవడమే కాదు, దాంతోనే కాలేజీ కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నారు. నాటకాలు కూడు పెడతాయా? అనే వాళ్లకు వీళ్లే దీటైన జవాబుగా నిలిచారు. ఎందుకంటే ఆ నాటకాలే వాళ్లకి గౌరవ వేతనం అందిస్తున్నాయి. కళాతృష్ణ తీర్చుతూ ఆత్మసంతృప్తి కూడా కలిగిస్తున్నాయి. ఆ యువబృందం అభిరుచి, విజయ ప్రస్థానం... అలా మొదలైంది నాటక రంగంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ 'ది విజిట్‌' గురించి తెలిసే ఉంటుంది! ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆంగ్ల నాటకమది. కొద్దిపాటి మార్పులతో దాన్నే 'మిస్‌ మీనా'గా తీర్చిదిద్దాడు తమిళనాడుకు చెందిన రాజీవ్‌ కృష్ణన్‌. అతడినే 'థియేటర్‌ ఔట్‌రీచ్‌ యూనిట్‌'కి హెడ్‌గా హైదరాబాద్‌ తీసుకొచ్చారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, రతన్‌టాటా-నవాజ్‌భాయ్‌ ట్రస్టు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు రూపొందించాయి. నాటకాల పట్ల అభిరుచి ఉన్న యువతని చేరదీసి, శిక్షణ ఇప్పించి నాటకాలు వేయిండమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నాటక రంగంలో అనుభవం ఉన్న హెచ్‌సీయూ విద్యార్థి చంద్రశేఖర్‌ రాజీవ్‌కి సహాయకుడిగా చేరాడు. ఇద్దరూ కలిసి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మిస్‌ మీనాని తీర్చి దిద్దారు. ఈ సమయంలోనే చంద్రశేఖర్‌ చురుకుదనం, ప్రతిభ గమనించిన రాజీవ్‌ అతడినే నాటకానికి సమన్వయకర్తగా, దర్శకుడిగా నియమించాడు. వీళ్లిద్దరూ ఔత్సాహికులైన 124 మంది యువతని పరీక్షించి చివరికి అందులోంచి పదిమందిని వివిధ పాత్రలకు ఎంపిక చేశారు. వారికి రెండు నెలలు శిక్షణ ఇప్పించారు.
యువతే లక్ష్యం మిస్‌ మీనా మూసకి భిన్నంగా, యువతరానికి నచ్చే నాటకం. ప్రేమ, హాస్యం, డ్యూయెట్స్‌.. అన్నీ సమపాళ్లలో రంగరించారు. అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయి కసిగా ఎదుగుతుంది. దేశం గర్వించే నటిగా మారుతుంది. పదిహేనేళ్ల తర్వాత సొంతూరి కష్టాలు తీర్చడానికొస్తుంది. క్లుప్తంగా ఇదీ కథ. జనవరి 26న తొలిసారి వరంగల్‌లో మొదలుపెట్టి ఇప్పటికి 59 చోట్ల ప్రదర్శించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలే నాటకానికి వేదికలు. గతంలో డ్రామాలకి మహరాజ పోషకులు కుర్రకారే. కానీ ప్రస్తుతం నాటకం అనే ఓ కళా ప్రక్రియ ఉందనే విషయమే చాలామందికి తెలియదు. అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే కాలేజీలనే ప్రదర్శనలకు వేదికలుగా ఎంచుకుంటున్నాం అంటున్నాడు చంద్రశేఖర్‌. విద్యార్థుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. మళ్లీమళ్లీ రమ్మంటూ నుంచి ఆహ్వానాలందుతుంటే, వర్క్‌షాపులు నిర్వహించమని యాజమాన్యాలు కోరుతున్నాయి. సో.. ఈ ప్రయత్నంలో యువబృందం విజయవంతం అవుతున్నారనే చెప్పొచ్చు.
- మానుకొండ నోబుల్‌, న్యూస్‌టుడే: ఆకివీడు
నట బృందమిదే...
అశ్వనీ శ్వేత, సాయికిరణ్‌ యాదవ్‌, పవన్‌ రమేష్‌, సాయిలీల, ప్రవీణ్‌కుమార్‌, పద్మశ్రీ, శ్రీనివాస్‌, నిఖిల్‌జాకబ్‌, వికాస్‌, చైతన్య, బుచ్చిబాబు, జ్ఞానప్రకాష్‌, షేక్‌ జాన్‌బషీర్‌.
కొత్తదనం.. సందేశం!
ప్రకాశం జిల్లా కందులూరు మా సొంతూరు. నాటక నేపథ్యం ఉన్న కుటుంబం మాది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాటక రంగంపై పీహెచ్‌డీ చేస్తున్నా. 2010లో 'కటకటదేశం-తికమకరాజు' నాటకానికి సంగీత దర్శకుడిగా నంది అవార్డు గెల్చుకున్నా. ఒకప్పుడు వెలుగు వెలిగిన నాటక రంగం సినిమాల ప్రభావంతో కళా విహీనమైంది. నేటి తరాలకు నాటకం అంటే ఓ అర్థంకాని బ్రహ్మ పదార్థంగా మిగిలిపోతోంది. అందుకే మేం కళాశాలల్లోనే నాటకాలు వేస్తూ యువతకి దగ్గరవుతున్నాం. ఆకట్టుకునే కథాంశం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే ప్రతి నాటకం విజయవంతం అవుతుందని నా నమ్మకం. అది చెబుతూనే అంతర్లీనంగా యువతకి ఓ సందేశం ఇస్తున్నాం.
అభిరుచికి అవకాశాల అండ
ప్పటికీ నాటకాల్ని అభిమానించే యువతకి కొదవ లేదు. ఎటొచ్చీ ఆ రంగం ఎంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుందనే నమ్మకం లేకే చాలామంది ఇటువైపు రావడం లేదు. నిజానికి ఇక్కడున్న అవకాశాలు తక్కువేం కాదు. థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సు పూర్తి చేసినవాళ్లకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో బోధకులుగా అవకాశం. ప్రతిభ నిరూపించుకుంటే సినిమా ఛాన్సులూ పలకరిస్తాయి. హెచ్‌సీయూ, రతన్‌టాటా ట్రస్టు సంయుక్తంగా నిర్వహిస్తున్న 'థియేటర్‌ ఔట్‌రీచ్‌ యూనిట్‌'కి ఎంపికైతే నెలకి రూ. 15 వేల గౌరవ వేతనం అందుతుంది. డిప్లమా, డిగ్రీ స్థాయిలో విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌లు ఇస్తోంది. ఇవిగాక మైనారిటీ, రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లూ ఉన్నాయి. తెలుగు, ఉస్మానియా, ఆంధ్రాలతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్‌ ఆఫ్‌ పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో కోర్సులు అందిస్తున్నాయి. జాతీయస్థాయిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయి.
This entry was posted in :

0 comments:

Post a Comment